: కక్ష సాధింపు ఎంతమాత్రం కాదు... పక్కా ఆధారాలున్నాయి: కేంద్రానికి టీ సర్కార్ నివేదిక
ఓటుకు నోటు కేసులో టీడీపీపై తాము కక్ష సాధింపు ధోరణిలో వెళుతున్నామన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. పక్కా ఆధారాలతోనే ఓటుకు నోటు కేసు నమోదు చేశామని ఆ నివేదికలో కేసీఆర్ సర్కారు తెలిపింది. తన వాదనను బలంగా వినిపించేందుకు ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను కూడా తన నివేదికకు జత చేసింది.
సాక్ష్యాధారాలు లభించాక నేరస్థులపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామని కూడా కేంద్రానికి వివరించింది. తాము సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేస్తే, తాము చేయగలిగిందేమీ లేదని కూడా ఆ నివేదికలో తెలంగాణ ప్రభుత్వం తన వాదనను వినిపించిందని కూడా విశ్వసనీయ సమాచారం.