: బంగ్లా చేతిలో భారత్ చిత్తు... 79 పరుగుల తేడాతో ఓటమి
పసికూన బంగ్లాదేశ్ చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లా నగరం మీర్పూర్ లో నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు 49.4 ఓవర్లలో ఆలౌటైనా 307 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ల నుంచి టెయిలెండర్ల దాకా క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు రాణించాడు. తమీమ్ ఇక్బాల్ (60), సౌమ్య సర్కార్ (54) జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఆ తర్వాత షకీబ్ (52), షబ్బీర్ రెహ్మాన్ (41), నాసిర్ హుస్సేన్ (34), మోర్తజా (21) రాణించారు. 35 ఓవర్ల దాకా నిలకడగానే ఆడిన బంగ్లా బ్యాట్స్ మెన్, ఆ తర్వాత వరుసగా వికెట్లు జారవిడుచుకున్నారు.
ఆ తర్వాత 308 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46 ఓవర్లలో కేవలం 228 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (63), శిఖర్ ధావన్ (30) శుభారంభాన్నే ఇచ్చినా, మిగిలిన టీమిండియా బ్యాట్స్ మెన్ అంతా వచ్చీ రాగానే పెవిలియన్ బాట పట్టారు. వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) సింగిల్ పరుగుకే వెనుదిరగగా, అజింక్యా రెహానే (9) స్వల్ప స్కోరుకు వెనుదిరిగాడు.కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (5) కూడా సింగిల్ డిజిట్ పరుగుకే ఔటయ్యాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (40), రవీంద్ర జడేజా (32) బ్యాట్లు ఝుళిపించడంతో విజయంపై కాస్త ఆశలు చిగురించాయి. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ (25), మోహిత్ శర్మ (11) పోరాడినా విజయం దక్కలేదు. కేవలం 46 ఓవర్లలోనే ఆలౌటైన టీమిండియా 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.