: హైదరాబాద్ ను పదేళ్లపాటు యూటీ చేయండి, లేకపోతే భద్రతను సీఆర్పీఎఫ్ కు అప్పగించండి: టీడీపీ నేత గాలి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా గవర్నర్ నరసింహన్ పట్టించుకోవడం లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. నీటి పారుదల ప్రాజెక్టు సుంకేసులపై బాంబులు వేస్తామని, హైదరాబాద్ నుంచి తరిమికొడతామని కేసీఆర్ అంటున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో ప్రజలకు ఎంత వరకు భద్రత ఉంటుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదును పదేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని లేదా నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణను సీఆర్పీఎఫ్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులపై బాంబులు వేస్తామన్న కేసీఆర్ పై ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు.