: వీడిన మిస్టరీ... ప్రమోషన్ కోసమే స్వాతి హత్య
విజయనగరం జిల్లాలో కలకలం సృష్టించిన రైల్వే ఉద్యోగిని స్వాతి హత్య కేసులో మిస్టరీ వీడింది. దాదాపు నెల రోజుల విచారణ తరువాత, ఆమె అడ్డులేకుంటే తనకు ప్రమోషన్ వస్తుందని భావించిన అదే కార్యాలయ ఉద్యోగి గోపీ హత్యకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. హత్యకు సహకరించిన మరో ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. గతనెల 11న శృంగవరపు కోట మండల కేంద్రం రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో పనిచేస్తున్న స్వాతి దారుణ హత్యకు గురవడం తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. సుమారు 1200 మంది అనుమానితుల నుంచి సమాచారం సేకరించామని, రైల్వే ఉద్యోగులు, ప్రైవేటు కార్మికులు, టీ, సమోసాలు అమ్మే చిరు వ్యాపారులను ప్రశ్నించామని తెలిపారు. ఈ కేసులో ఒక దశలో స్వాతి భర్తపై అనుమానాలు వచ్చాయి. కాగా, విచారణ అనంతరం గతంలో ఇనుప తుక్కు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి పోలీసు కేసులను ఎదుర్కొన్న గోపీయే హంతకుడని తేల్చామని పోలీసులు వివరించారు.