: ఫ్లైట్ టికెట్లు దొరకలేదట... కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ హైదరాబాదు పర్యటన వాయిదా?

ఓటుకు నోటు వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడ విభేదాలను తగ్గించే క్రమంలో రంగంలోకి దిగిన కేంద్రం చర్యలు మరింత ఆలస్యమవుతున్నాయి. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ నేడు హైదరాబాదుకు రావాల్సి ఉంది. కేంద్ర హోంశాఖలోని పలువురు కీలక విభాగాల అధికారులతో హైదరాబాదు రానున్న ఆయన వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తారని నేటి ఉదయం వార్తలు వెలువడ్డాయి. అయితే సమయం మధ్యాహ్నం దాటిపోతున్నా, అలోక్ కుమార్ తన కార్యాలయంలో రోజువారీ పనిలోనే తలమునకలై ఉన్నారు. హైదరాబాదు వెళ్లాలి కదా, అలోక్ కుమార్ ఇంకా ఇక్కడే ఉన్నారేంటన్న ప్రశ్నలకు స్పందించిన హోంశాఖ వర్గాలు ఆసక్తికర సమాధానమిచ్చాయి. హైదరాబాదు వెళ్లేందుకు అలోక్ కుమార్ బృందానికి ఫ్లైట్ టికెట్లు దొరకలేదని, దీంతోనే ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అలోక్ కుమార్ హైదరాబాదు పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడిందన్న వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే సమయం మధ్యాహ్నం దాటిపోతుండటంతో ఇక ఈ రోజు ఆయన హైదరాబాదు పర్యటన అనుమానమేనని, సదరు పర్యటన రేపటికి వాయిదా పడ్డట్టేనని ఆ వర్గాలు తెలిపాయి.

More Telugu News