: ఉద్యోగుల భవిష్యత్ ప్లాన్ ను చెడగొట్టిన ఈపీఎఫ్ఓ... ఎలాగంటే...!

ఆయనో ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హౌస్ చీఫ్. తన పదవీ విరమణ తరువాత కేంద్రం నియంత్రణలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)పై కోర్టు కేసు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈపీఎఫ్ఓ తన వద్ద ఉన్న ఉద్యోగుల పదవీ విరమణ నిధిలో 5 శాతాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టాలని చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నందుకు! ఈ నిర్ణయమేదో 20 ఏళ్ల క్రితమే తీసుకుని ఉంటే కోట్లాది మంది ఉద్యోగులు తమ పదవీ విరమణ అనంతరం లక్షాధికారులుగా ఘనమైన జీవితాన్ని గడిపివుంటారన్నది ఆయన వాదన. ఒక్కసారి అవునా? అని మీరనుకుంటే... మీక్కూడా ఈపీఎఫ్ఒపై కాస్తంత కోపం వస్తుంది. 700 శాతం పెరిగిన సెన్సెక్స్ లాభాలను అందిపుచ్చుకోలేక పోయామే అన్న బాధా కలుగుతుంది. ఊహాజనితమే అయినా, ఉదాహరణకు 1995లో మీరు ఉద్యోగంలో చేరి అప్పటి నుంచి మీ వేతనంలో పీఎఫ్ కట్ అవుతోందని అనుకుందాం. నెలకు రూ. 2 వేల చొప్పున పీఎఫ్ కట్ అవుతున్న (యజమాని చెల్లించే పీఎఫ్ కంట్రిబ్యూషన్ సహా) వ్యక్తి నిధిలోని 5 శాతం మొత్తాన్ని, జూన్ 1995 నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టి వుంటే ఈ పాటికి అది రూ. 29.35 లక్షల రూపాయలకు పెరిగివుండేది. దాన్నే 9 శాతం వడ్డీ వచ్చే పథకాల్లో పెట్టుంచితే, ఆ వచ్చే మొత్తం ద్రవ్యోల్బణం భారాలు పోను నెలకు రూ. 30 వేల చొప్పున కనీసం 10 సంవత్సరాలకు కూడా సరిపోదు. ఇదే సమయంలో నిఫ్టీ-50 సూచికలో ఉంచినట్లయితే, ఆ 5 శాతం పెట్టుబడి ఏకంగా రూ. 30.05 లక్షలకు చేరి వుండేది. అదే పెద్దగా రిస్క్ తీసుకోకుండా 15 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసివుంటే పదవీ విరమణ నిధి మరో 7.2 శాతం పెరిగి రూ. 31.46 లక్షలకు చేరుతుంది. ఈ ఉదాహరణలో తొలి నెలలో పెట్టిన పెట్టుబడి కేవలం రూ. 100 మాత్రమే (రూ. 2 వేలల్లో 5 శాతం), మొత్తం పదేళ్లకు పెట్టిన పెట్టుబడి రూ. 19,125 (సంవత్సరానికి వేతనం 10 శాతం పెరిగే లెక్కపై). కానీ పెరిగిన నిధిని చూస్తే కళ్లు జిగేల్మనక మానవు. నేటి పరిస్థితుల్లో రూ. 30 లక్షలు అంటే మరో 20 లేదా 25 సంవత్సరాలు గర్వంగా బతికేందుకు సరిపోవేమో! ముందు జాగ్రత్తగా పీఎఫ్ లో ఓ 50 శాతం మార్కెట్లో పెట్టుబడి పెట్టి వుంటే, మీరూహించనంత నిధి మీకోసం సిద్ధమై ఉండేది. ఇదే సదరు ఫండ్ మేనేజర్ కు కోపం తెప్పిస్తున్న అంశం. ఈపీఎఫ్ఓ ముందే స్పందించి వుంటే పదవీ విరమణ తరువాత లక్షలాది మంది ఆనందంగా జీవనం గడిపి వుండేవారన్నది ఆయన ఆక్రోశం. అయితే, స్టాక్ మార్కెట్లో ఎత్తుపల్లాలు ఎంతో సహజం. దీర్ఘకాలంలో ఉంచిన పెట్టుబడులకే రక్షణ ఉంటుందని భావించాల్సిన అవసరం ఉందని మరవద్దు.

More Telugu News