: ఇరుగు పొరుగు వారికి నరకం చూపుతున్న 'జమైకా చిరుత'

రన్నింగ్ ట్రాక్ పై దిగితే అతనికి తిరుగులేదు. ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టిన ఘనత అతనిది. ఆరుసార్లు ఒలింపిక్ చాంపియన్ గా నిలిచి 'జమైకా చిరుత'గా పేరు తెచ్చుకున్న ఉసేన్ బోల్ట్ తన పక్కింటి వారికి మాత్రం నరకం చూపుతున్నాడు. పరుగు పోటీలు లేనప్పుడు బోల్ట్ ఇంట్లో ఉంటే, ఆ రోజు తమకు నరకమేనని, రాత్రుళ్లు నిద్రపోయే పనే లేదని ఇరుగు పొరుగు వారు వాపోతున్నారు. పెద్ద పెద్ద స్పీకర్లతో ధ్వని కాలుష్యంతో పాటు అసభ్య పార్టీలు చేసుకుంటూ తన స్నేహితులతో కలిసి బోల్ట్ చేసే గోలపై ఆ ప్రాంతం వారు ఫిర్యాదులు చేసినట్టు బ్రిటన్ దినపత్రిక 'డైలీ మెయిల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "తెల్లవార్లూ బైకుల శబ్దాలు, అరుపులు, కేకలు పడలేక బోల్ట్ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్లిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం" అని ఓ మహిళ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టింది. రెండేళ్ల క్రితం బోల్ట్ తమ పక్కింటికి వచ్చి చేరాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆయనకున్న ఇమేజ్ కారణంగా చర్యలుతీసుకోవడం లేదని ఆమె వాపోయింది. మరో స్థానికుడు "ఆయన మాకు నరకం నుంచి వచ్చిన పొరుగువాడు" అని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని, బోల్ట్ బరిలోకి దిగితే, దేశమంతా ఆయన గెలవాలని కోరుకుంటుందని వెనకేసుకొచ్చేవారూ లేకపోలేదు.

More Telugu News