: అలహాబాద్ సమీపంలో కూలిన శిక్షణ విమానం... పైలట్లు సేఫ్
అలహాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నుంచి బయలుదేరిన 'జాగ్వార్' ఫైటర్ జెట్ విమానం అక్కడికి 18 కి.మీ దూరంలో ఈ ఉదయం 8:15 గంటల సమయంలో కుప్పకూలింది. భారత వైమానికి చెందిన ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానం శిక్షణకు ఉద్దేశించినదని, విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి, అది క్రాష్ ల్యాండింగ్ అవుతోందని గమనించిన పైలట్లు, 'ఎజెక్ట్' బటన్ సాయంతో తప్పించుకున్నట్టు సమాచారం. విమానం జనావాసాలపై కూలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం కూలిపోయిన ప్రమాదంపై విమానయాన శాఖ విచారణకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.