: గవర్నర్, కేసీఆర్ లపై జూపూడి విమర్శలు
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ లపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీత దాటినా సెక్షన్ -8 అమలుకావడం లేదని మీడియా సమావేశంలో జూపూడి అన్నారు. హైదరాబాద్ లో ఏపీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత ప్రమాదమో నిన్నటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియలేదని పేర్కొన్నారు. ట్యాపింగ్ భయంతోనే కేసీఆర్ ఈరోజు గవర్నర్ ను కలిశారని అన్నారు. కేసీఆర్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు.