: మీరు ఊహించింది కరెక్టే... ఇవి పవర్ స్టార్ నుంచే అందుకున్నా: నితిన్ ట్వీట్
టాలీవుడ్ యువ హీరో నితిన్ ఆనందభరితుడయ్యాడు. ఓ విశిష్ట వ్యక్తి నుంచి వచ్చిన పార్శిల్ అందుకోవడమే నితిన్ సంతోషానికి కారణం. ఆ పార్శిల్ ఏంటంటే ఓ పండ్ల బుట్ట. ఆ బుట్టలో ఉన్నవి మామిడి పండ్లు... వాటిని పంపింది మరెవరో కాదు... నితిన్ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తనకు పార్శిల్ వచ్చిన విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. "ఔను... మీరు ఊహించింది కరెక్టే! ఇవి మన పవర్ స్టార్ నుంచే అందుకున్నా" అంటూ ట్వీట్ చేశాడు. హైదరాబాదు నగర శివారు ప్రాంతంలో పవన్ కు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ఆయన రకరకాల పంటలు పండిస్తుంటారు. సీజన్ కావడంతో మామిడి కాపు చేతికి వచ్చింది. దీంతో, ఆయన తన ఆప్తులందరికీ తియ్యటి మామిడి పండ్లను పంపిస్తున్నారు. ఇటీవలే ఓ యువ దర్శకుడికి మామిడి పండ్ల బుట్ట పంపి ఆశ్చర్యపరిచాడు. అన్నట్టు, నితిన్ కు పవన్ గతేడాది కూడా మ్యాంగో ట్రీట్ ఇచ్చాడు.