: మంత్రి మాణిక్యాలరావు సంభాషణ రికార్డ్... అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇరుకునపడింది. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సంభాషణను బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఫోన్ రికార్డ్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసినట్టు తేలిన నేపథ్యంలో తన సంభాషణను రికార్డ్ చేయడంతో మంత్రి ఉలిక్కిపడ్డారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో ఈ ఘటన జరిగింది. శ్రీశైలం దేవస్థానం పాలక మండలిలో పార్టీ నేత ఒకరికి అవకాశం కల్పించే విషయంపై కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ కు వచ్చి మంత్రిని కార్యాలయంలో కలిశారు. ఈ సమయంలో నామినేటెడ్ పోస్టుల అంశంపై మంత్రి మాట్లాడిన మాటలను, తరువాత ఇదే విషయంపై పార్టీలో ఓ ముఖ్య నేతతో మాణిక్యాలరావు జరిపిన ఫోన్ సంభాషణను సదరు కార్యకర్త తన ఫోన్ లో రికార్డ్ చేశారు. దాన్ని గుర్తించిన మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మాణిక్యాలరావుకు చెప్పాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లో రికార్డ్ అయిన సంభాషణలను తొలగించి, అతడిని వదిలి పెట్టారు.

More Telugu News