: తండ్రి శవం, సోదరి, కుక్కల అస్థికలతో సహవాసం
కోల్ కతాలో ఒళ్లుగగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం మృతిచెందిన సోదరి, ఆమె పెంచుకుంటున్న కుక్కల కళేబరాలు, తండ్రి శవంతో సహవాసం చేస్తున్న మాజీ టెక్కీని పోలీసులు అదుపులోకి తీసుకుని మానసిక చికిత్సాలయానికి తరలించారు. కోల్ కతాలోని రాబిన్ సన్ లేన్లో ఉన్న ఓ ఇంటి బాత్రూం నుంచి పొగలు బయటకు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నారు. పార్థా డే (47) అనే వ్యక్తి బయటికి కనిపించకుండా, ఇంట్లోనే ఉంటూ కనిపించాడు.
దీంతో గాలింపు చేపట్టిన పోలీసులకు కాలిపోయిన పార్థా డే తండ్రి అరబిందా డే (77) మృతదేహం, ఓ పుర్రె, ఎముకలతో కూడిన బ్యాగు కనిపించింది. వీటిపై ఆరాతీయగా, పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పార్థా డేకి కుటుంబమంటే చాలా ఇష్టం, సోదరి అంటే ప్రాణం. సంగీత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసే ఆమె రెండు కుక్కలను పెంచుకుంటోంది. అవంటే ఆమెకు చాలా ఇష్టం. అవి అకస్మాత్తుగా మృతిచెందడంతో విషాదంలో ముునిగిపోయిన ఆమె, చాలాకాలం భోజనం మానేసి, నాలుగు నెలల కిందట ప్రాణం విడిచింది.
తరువాత తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, వారిని దహనం చేయడం ఇష్టం లేక తనతోనే ఉంచుకున్నానని పార్థా డే వెల్లడించాడు. ప్రతిరోజు రాత్రి వారి ఆత్మలతో తాను మాట్లాడుతానని పోలీసులకు తెలిపాడు. దీంతో, పార్థా డేను అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం మానసిక చికిత్సాలయానికి తరలించారు.