: ప్రతీకారం కోసం విమానాలను రంగంలోకి దించిన సైన్యం
ఇండియా- మయన్మార్ సరిహద్దుల్లో రెచ్చిపోతున్న మిలిటెంట్లను నిలువరించాలన్న లక్ష్యంతో విస్తృత కూంబింగ్ చేపట్టిన భారత సైన్యం అందుకు వాయుసేన సహాయం తీసుకుంటోంది. తేలికపాటి యుద్ధవిమానాలతో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మిలిటెంట్లు ఎక్కడ తలదాచుకున్నారన్న విషయాన్ని గుర్తించి ఆపై భద్రతా దళాలు మెరుపుదాడి చేస్తున్నాయి. ఇప్పటివరకూ 50 మంది మిలిటెంట్లను ఎన్ కౌంటర్ లో హతమార్చినట్టు తెలుస్తోంది. గతవారం ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసి 18 మంది సైనికుల మృతికి కారణమయ్యారని భావిస్తున్న మిలిటెంట్లు సైతం మృతుల్లో ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. ఆర్మీ దాడుల్లో ఎన్ఎస్సీఎన్ (కే) నేత, జూన్ 4 దాడిలో కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణలున్న స్టార్ సన్ లాంకాంగ్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గతవారం రెండు మిలిటెంట్ క్యాంపులపై దాడులు జరిగిన తరువాత, ప్రధాని మోదీ స్వయంగా కల్పించుకుని మిలిటెంట్ల ఏరివేతను వేగవంతం చేయాలని ఆదేశించడంతో అటు భద్రతాదళాలు, ఇటు వాయు సేన విరుచుకుపడుతున్నాయి.