: ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు, తాగేందుకు నీరు కూడా ఇవ్వలేదు: వాపోయిన రేవంత్
విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు తనను ఇబ్బందులు పెట్టారని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సాయంత్రం కస్టడీ పూర్తయిన అనంతరం రేవంత్ ను కోర్టుకు హాజరు పరిచేందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా, విచారణలో భాగంగా అధికారుల ప్రవర్తన ఎలా వుంది? మిమ్మల్ని ఇబ్బందులేమైనా పెట్టారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఏసీబీ తీరుపై రేవంత్ పలు ఫిర్యాదులు చేశారు. ఏసీబీ అధికారుల తీరును ఆక్షేపిస్తూ, కనీసం తాగేందుకు మంచినీరు అడిగినా ఇవ్వలేదని వాపోయారు. సిట్ ఆఫీసులో గార్డులు కూర్చునే చోట పడుకోమన్నారని చెప్పారు. సమయానికి టిఫిన్ కూడా పెట్టలేదని అన్నారు. తనకు గొంతునొప్పిగా ఉందని చెబితే ఒక్కరు కూడా పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. సంబంధం లేని అధికారులు వచ్చి తనను ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. వీటన్నింటినీ నోట్ చేసుకున్న న్యాయమూర్తి ఆరోపణలను పరిశీలిస్తానని చెప్పారు.