: ఇష్టమైన పనే దొరికింది... భారత్-ఏ జట్టు కోచ్ పదవిపై రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్య

భారత్-ఏ, అండర్-19 జట్టు కోచ్ గా నియమితుడైన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ సంతోషంగానే ఉన్నాడట. అంతేకాదండోయ్, తనకిష్టమైన పనినే బీసీసీఐ తనకు అప్పగించిందని అతడు పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన త్రిసభ్య కమిటీలో పనిచేసేందుకు ఇష్టపడని ద్రావిడ్ కు ఏ తరహా బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు సాగాయి. అయితే ద్రావిడ్ ను జూనియర్ జట్లకు కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయంపై ద్రావిడ్ నిన్న హర్షం ప్రకటించాడు. యువ క్రికెటర్లకు తగిన సలహాలిచ్చి వారిని మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దడం తనకు ఎంతో ఇష్టమని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘ఇది చాలా ఆసక్తికరం. ఎప్పట్నుంచో ఇలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నా. భవిష్యత్తులో భారత క్రికెట్ మరింత బలోపేతం కావడానికి నా వంతు కృషి చేస్తా. నాకున్న అనుభవంతో వారికి సహాయం చేయగలనన్న నమ్మకముంది’’ అని అతడు చెప్పారు. ఇక జాతీయ జట్టుకు కోచ్ గా పనిచేయాలన్న ఆసక్తి తనకు లేదని అతడు పేర్కొన్నాడు.

More Telugu News