: దాసరి కుమారుడి ఇంటి దొంగ దొరికాడు

దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో అరుణ్ నివాసం ఉంది. అతని దగ్గర గత ఐదు సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పెద్ద మంగళహాట్ గ్రామానికి చెందిన నల్లమట్టి అచ్చమ్మగారి ప్రవీణ్ కుమార్ రెడ్డి (30) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను అరుణ్ ఇంటి తాళంచెవిని దొంగిలించాడు. గత నెలలో కుటుంబంతో వేసవి సెలవులను గడిపేందుకు అరుణ్ చైనాకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, ఇదే అదనుగా భావించి... తన దగ్గరున్న తాళం చెవితో ఇంట్లో ప్రవేశించి, రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన వాచ్ లను దొంగిలించాడు. చైనా నుంచి తిరిగివచ్చిన తర్వాత తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు అరుణ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, డ్రైవర్ ను విచారించగా, అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో, అతనిపై నిఘా ఉంచి, చివరకు అతనే దొంగతనం చేశాడని తేల్చారు. అతని దగ్గర్నుంచి రూ. 60 వేల నగదు, డైమండ్ రింగ్, రోలెక్స్ వాచ్ లు, చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News