: టీడీపీ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్రలో భాగమే కేసు... ఏసీబీ విచారణలో రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు వ్యవహారంతో తనకేమాత్రం సంబంధం లేదని టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి చెప్పారట. ఈ కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో విచారించేందుకు అనుమతి పొందిన ఏసీబీ అధికారులు నిన్న తమ అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు నిన్న రెండు గంటల పాటు మాత్రమే రేవంత్ ను విచారించారు. విచారణలో భాగంగా ఈ వ్యవహారంతో తనకేమాత్రం సంబంధం లేదని రేవంత్ చెప్పారు.
వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు టీడీపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఈ కేసులో కుట్రపూరితంగా తనను ఇరికించారని ఆయన వాదించారట. ఇదిలా ఉంటే, తొలి రోజు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని పొడిపొడిగానే ప్రశ్నించారట. అయితే ఈ కేసులో సహనిందితులుగా ఉన్న వారిపై మాత్రం ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. సహనిందితులు చెప్పిన విషయాల ఆధారంగా రేవంత్ ను విచారించేందుకు ఏసీబీ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ను తెరపైకి తేనున్నట్లు తెలుస్తోంది. నిన్న విచారణ ముగిసిన అనంతరం రేవంత్ ను బషీర్ బాగ్ లోని సిట్ కార్యాలయానికి తరలించిన ఏసీబీ సిబ్బంది, నేటి ఉదయం తిరిగి ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు.