: మంత్రి పీతల సుజాత తండ్రిని కలిసేందుకే వచ్చా: అద్దాల విష్ణువతి
మంత్రి పీతల సుజాత తండ్రిని కలిసేందుకే వచ్చానని పోలీసుల అదుపులో ఉన్న అద్దాల విష్ణువతి అనే మహిళ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని మంత్రి సుజాత తండ్రి బాబ్జీ నివాసం వద్ద దొరకిన నగదు సంచి వ్యవహారంలో ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. తన మేనకోడలు పెళ్లి సందర్భంగా ఎస్ బీఐ బ్యాంకులో డబ్బు డ్రా చేశానని వివరించింది. మంత్రి ఇంటికి వెళ్లినప్పుడు ఆ డబ్బుల బ్యాగ్ ను మర్చిపోయానని విష్ణువతి చెప్పుకొచ్చింది.
మరోవైపు ఇదే విషయంలో మంత్రి పీతల సుజాత తండ్రిని కూడా విచారించినట్టు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భూషన్ తెలిపారు. రూ10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, బ్యాగ్ లో రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పారు. మంత్రి హౌస్ కీపర్ చిల్లి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.