: చంద్రబాబు మెడకు ఓటుకు నోటు కేసు?...టీ సర్కారు యత్నాలతో అప్రమత్తమైన టీడీపీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును దక్కించుకునేందుకు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి చేసిన దుస్సాహసం ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండగా మారింది. డబ్బుల కట్టలతో రేవంత్ రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోగా, ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కూడా ఇరికించేందుకు తెరవెనుక భారీ కసరత్తే జరుగుతోందట. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను పసిగట్టిన టీడీపీ వెనువెంటనే అలర్ట్ అయిపోయింది.
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇరు పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ ఉచ్చులో చిక్కడంతో రెండు పార్టీలు మరింత మేర అవగాహనకు వచ్చాయి. దీంతోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చాలని ఈ సందర్భంగా గవర్నర్ ను జగన్ కోరారు.
తదనంతరం తెలంగాణ ఏసీబీ డీజీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వద్ద రూ.50 లక్షలు పట్టుబడిన నేపథ్యంలో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)ని రంగంలోకి దించే విషయాన్ని తెలంగాణ సర్కారు పరిశీలిస్తోందట. తెలంగాణలో జరిగిన వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత గవర్నర్ ను కలవడం, వెనువెంటనే ఏసీబీ డీజీ కూడా గవర్నర్ తో భేటీ తదితర పరిణామాలతో టీడీపీ అలర్ట్ అయిపోయింది. ప్రభుత్వ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న ఆ పార్టీ నేతలు కేసుపై పూర్తి స్థాయి దృష్టి సారించారు.