: బానిసలు, భారీ ఏనుగులు, అద్భుత పోరాటాలు... బాహుబలి ట్రైలర్ లో ఉన్నదిదే!
ఈ ఉదయం 10:30 గంటలకు వివిధ సినిమా హాళ్లలో రిలీజైన బాహుబలి ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకర్షించింది. ఓ పెద్ద వాటర్ ఫాల్స్ ముందు తమన్నా (అవంతిక) నృత్యం, ఆమెను ప్రభాస్ (బాహుబలి) చూడగానే పరుగుతీయడం, ఓ అతిపెద్ద విగ్రహ ప్రతిష్ఠ, రాజ ప్రాసాదాలు, మందీమార్బలంతో రానా (భల్లాలదేవ) రావడం, బానిసలను కొరడాలతో కొడుతూ హింసిస్తున్న దృశ్యాలు, ఏనుగుల ఘీంకారం, యుద్ధానికి సిద్ధమై పరుగులు పెడుతున్న భారీ దున్నపోతు, "మీ నిప్పులు చిందిన కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి" అన్న ప్రభాస్ డైలాగ్ ఈ ట్రైలర్లో ఉన్నాయి.
ఇంకా, "నేను ఎవరినీ?" అన్న ప్రభాస్ ప్రశ్న, "మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు" అన్న నాజర్ సమాధానం, "జై మాహిస్మృతే" అన్న భల్లాలదేవ ఘీంకారం, భీకర యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లు, ప్రభాస్, రానాలు శత్రు సైన్యాలపై విరుచుకు పడడం వంటి సీన్లున్నాయి. చివరిగా, ఓ నదిలో నిండా మునిగిపోయిన స్థితిలో కూడా చిన్నారిని ఒక చేత్తో మోస్తూ వస్తున్న వ్యక్తి దృశ్యంతో ట్రైలర్ ముగిసింది. పలువురు అభిమానులు దీన్ని తమతమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.