: హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి...అదుపులో 60 మంది
హైదరాబాదులోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న 44 హుక్కా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్నట్టు, హుక్కా సెంటర్ల ముసుగులో యువతను డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఈ సెంటర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు, నిబంధనలకు వ్యతిరేకంగా హుక్కా తాగుతున్న 60 మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మొదటి తప్పుగా భావించి కౌన్సిలింగ్ తో సరిపెట్టనున్నట్టు తెలిపారు. మరోసారి ఇలా పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.