: మెడిసిన్ చేయడం ఇష్టం లేక కిడ్నాప్ కథ అల్లాడు
మెడిసిన్ చేయడం ఇష్టం లేని ఓ విద్యార్థి కిడ్నాప్ కథ అల్లాడు. అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో మూడు రోజుల కిడ్నాప్ డ్రామాను రట్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ కి చెందిన మహ్మద్ ఒవైసీ అనే విద్యార్థిని మెడిసిన్ కోచింగ్ నిమిత్తం తండ్రి లక్నోలోని ఓ హాస్టల్ లో జాయిన్ చేశారు. మరో రెండు రోజుల్లో మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష ఉందనగా, ఈ కుర్రాడు మే 22న హాస్టల్ నుంచి మాయమయ్యాడు.
కుమారుడు మాయం కావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తరువాతి రోజు నుంచి వేర్వేరు సిమ్ కార్డులతో కిడ్నాపర్ల నుంచి అతడి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చేది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు గుట్టురట్టు చేశారు. బాలుడిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, మెడిసిన్ చడవడం ఇష్టం లేక, కిడ్నాప్ డ్రామా ఆడినట్టు వెల్లడించారు. ఈ కిడ్నాప్ డ్రామా కోసం 23 వేర్వేరు సిమ్ కార్డులు వినియోగించినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా అతనిని మొరాదాబాద్ లో పట్టుకున్నట్టు పోలీసులు వివరించారు.