: అంతిమ సమరాన విజేతలెవరు?
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా మరికొన్ని గంటల్లో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా అంతిమసమరం జరగనుంది. ఫైనల్ పోరులో విజేతలెవరు? అనే దానిపై అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రెండు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తో ఒకసారి టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ పోటీ పడగలదా? అనే అనుమానం అభిమానుల్లో రేకెత్తుతోంది. కాగా, ఫైనల్లో ఈ జట్లు రెండుసార్లు తలపడగా, చెరోసారి విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాయి. ఆరుసార్లు ఫైనల్ చేరి చెన్నై ఐపీఎల్ లో తిరుగులేని జట్టుగా విరాజిల్లుతోంది. కాగా, ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మొదట్లో దారుణంగా విఫలమైనప్పటికీ కీలకమైన దశలో పుంజుకుని అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతోంది. కీరన్ పొలార్డ్, పార్థివ్ పటేల్, సిమ్మన్స్, రోహిత్ శర్మ, రాయుడు సత్తా చాటుతుండగా, బౌలింగ్ లో లసిత్ మలింగ, హర్భజన్ సింగ్ రాణిస్తున్నారు. ఇక చెన్నై జట్టులో అద్భుతమైన ఫాంతో జట్టును విజయతీరాలకు చేర్చిన ఓపెనర్ మెక్ కల్లమ్ అందుబాటులో లేకపోవటం తీరని లోటు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మైక్ హస్సీ సత్తా చాటడంతో చెన్నై ధైర్యంగా ఉంది. డ్వేన్ స్మిత్, డుప్లెసిస్, ధోని, రైనా రాణిస్తే ఎలాంటి జట్టైనా పరాజయం పాలుకావాల్సిందే. బ్యాటు, బంతితోనూ పవన్ నేగి, డ్వేన్ బ్రేవో రాణిస్తున్నారు. అశిష్ నెహ్రా మంచి ఫాంలో ఉండడంతో చెన్నై టైటిల్ సాధిస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.