: మారని ఎయిర్ ఇండియా పైలెట్ల తీరు... మందుకొట్టి విమానం నడిపేందుకు వచ్చిన పైలెట్
ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, ఎంతమందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఎయిర్ ఇండియా పైలెట్ల తీరు మారడం లేదు. వందలాది మంది ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన పైలెట్లు విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పైలెట్ మందుకొట్టి మరీ విమానం నడిపేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నిన్న షార్జాలో జరిగింది. షార్జా నుంచి కొచ్చి మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని నడిపేందుకు వచ్చిన పైలెట్ మద్యం సేవించి ఉన్నాడని సెక్యూరిటీ అధికారులు గుర్తించి, ఏఐ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మరో పైలెట్ కు బాధ్యతలు అప్పగించిన ఏఐ, ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. ఆ పైలెట్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏఐ అధికారి ఒకరు తెలిపారు.