: అమెరికాలో బైకర్ గ్యాంగ్ ఘాతుకం... కాల్పుల్లో 9 మంది దుర్మరణం
అమెరికాలో నిన్న రాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. బైకర్ గ్యాంగ్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన వాకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాకాలోని ఓ రెస్టారెంట్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఈ కాల్పులకు కారణమైంది. రెండు బైకర్ గ్యాంగ్ ల మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో ఓ గ్యాంగ్ ప్రత్యర్థి గ్యాంగ్ పై విచక్షణారహితంగా కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఘటనాస్థలంలోనే ఎనిమిది మంది చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడ్డ గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.