: టీవీ నటి కథ సుఖాంతం... పోలీస్ కౌన్సెలింగ్ ఎఫెక్ట్!
ప్రియుడి కుటుంబం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో టీవీ నటి రూపా కౌర్ (28) హుస్సేన్ సాగర్ లో దూకిన సంగతి తెలిసిందే. కేవల్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించిన రూప అతడి ఒత్తిడి మేరకు తనకెంతో ఇష్టమైన నటనకు కూడా స్వస్తి చెప్పింది. కానీ, ఓ నటి తమ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టేందుకు తన కుటుంబం ససేమిరా అంటోందని కేవల్ సింగ్ చెప్పడంతో ఆమె తీవ్రంగా మనస్తాపం చెందింది.
దీంతో ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కాపాడిన హుస్సేన్ సాగర్ లేక్ ఎస్సై శ్రీదేవి రూప సోదరుడిని, కేవల సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో, వారి వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. రూప, కేవల్ సింగ్ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. రూప అసలు పేరు హర్జీత్ కౌర్ కాగా, గత ఐదేళ్లుగా టీవీ సీరియళ్లలో నటిస్తోంది. శిఖరం, అంతఃపురం, ఆటో భారతి, చంద్రముఖి వంటి సీరియళ్లతో ఈ బొద్దు నటి బాగా పాప్యులరైంది. కాగా, కేవల్ సింగ్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.