: ఉచితమంటే వదులుతామా?
"ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాడు"... సరదాగా ఆటపట్టించడానికి తెలుగువారు వాడే సామెత ఇది. అదే నిజంగా ఉచితంగా ఏదైనా ఇస్తామని చెబితే... వదిలిపెడతారా ఎవరైనా? అందునా 'డంకిన్ డోనట్స్' వంటి ఈటరీ అయితే... అసలే వదలరు కదూ! హైదరాబాదు బంజారా హిల్స్ లో డంకిన్ డోనట్స్ ఔట్ లెట్ ఈ ఉదయం ప్రారంభమైంది. ముందుగా వచ్చిన 300 మందికి ఉచిత ఫుడ్ సర్వ్ చేస్తామని సంస్థ ప్రచారం చేయడంతో అర్ధరాత్రి నుంచే అక్కడ సందడి కనిపించింది. ఉదయం 6 గంటలకే 300 మందికి పైగా క్యూ పెరిగిపోయింది. ఇక షాపు తీసే సమయానికి 1000 మందికి పైగా అక్కడకు చేరిపోయారు. రోడ్ నంబర్ 1లోని కేర్ ఆసుపత్రి పక్కన ఈ ఔట్ లెట్ ఉండగా, 'ఉచితం' కోసం వచ్చిన వారి క్యూ ఆనంద్ నగర్ కాలనీలోకి పెరిగింది. అంతే మరి... ఉచితమంటే వదులుతామా?