: నేను కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదు... టీడీపీలో చేరలేదు: డీఎల్
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నించగా, ఆ పార్టీ కార్యకర్తలు నిరాకరించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పారు. అలాగని టీడీపీలోనూ చేరలేదన్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో డీఎల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి దుస్థితి ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.
రాజకీయ నాయకుడు అనేవాడు ఎన్నికల తరువాత అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని, ప్రస్తుతం అలాంటి రాజకీయాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే రాజకీయాలకు ఐదేళ్ల విరామం ప్రకటించుకున్నానని చెప్పారు. మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కోరినప్పుడు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తానని డీఎల్ తెలిపారు.