: కిడ్నాపయిన డాక్టర్ల జంట క్షేమం... పోలీసుల అదుపులో 9 మంది

పెళ్లికి వెళ్లి వస్తూ, కిడ్నాప్ కు గురైన డాక్టర్ల జంట పంకజ్ గుప్తా, శుభ్ర గుప్తాలను బీహార్, ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏడు రోజుల తరువాత కాపాడగలిగారు. పారిశ్రామికవేత్తల కుటుంబాలకు చెందిన ఈ దంపతులను 9 మంది దుండగులు కిడ్నాప్ చేశారని, వారందరినీ అదుపులోకి తీసుకున్నామని లక్నో అధికారులు వివరించారు. పంకజ్, శుభ్ర లు ఈ నెల 1వ తేదిన తమ ఆడీ కారులో గయాకు వెళుతున్న సమయంలో దుండగులు వారిని పోలీసు దుస్తుల్లో, వీఐపీలు వాడే ఎర్రబుగ్గ కార్లలో వెంబడించి అడ్డగించినట్టు తెలిపారు. వీరిని చూసి ఆ దంపతులు అయోమయంలో పడగా, తేరుకునే లోపే తమ వాహనాల్లోకి తోసి కిడ్నాప్ చేశారు. అనుమానం రాకుండా పలు వాహనాల్లోకి వీరిని మారుస్తూ లక్నో చేరుకున్నారు. అక్కడి ఒక ప్లాట్ లో వీరిని నిర్బంధించగా, బుధవారం కిడ్నాపర్ల సెల్ ఫోన్ ను చేజిక్కించుకున్న డాక్టర్, తమ కిడ్నాప్ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపాడు. దీంతో బీహార్, ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చెయ్యడానికి వీరు నాలుగు ఖరీదైన కార్లు ఉపయోగించారని, వీరున్న ప్లాట్ లో తుపాకి, బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

More Telugu News