: నాకు ఎర్రచందనం అంటే ఏమిటో కూడా తెలియదు: సినీ నటి నీతూ

ఎర్రచందనం కేసులో అరెస్టై, బెయిల్ పై బయటకు వచ్చిన సినీ నటి నీతూ అగర్వాల్... తనకు ఎర్రచందనం అంటే ఏమిటో కూడా తెలియదంటూ చెప్పుకొచ్చింది. 'ప్రేమ ప్రయాణం' సినిమా నిర్మాతగా తనకు మస్తాన్ వలీ పరిచయమయ్యాడని... ఆ పరిచయంతోనే అతడిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తాను రాజకీయాల్లో ఉన్నానని, రియలెస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నానని మస్తాన్ తనకు చెప్పినట్టు తెలిపింది. తన అకౌంట్ ద్వారా రూ. 2 లక్షలు ఎవరికో వెళ్లాయని పోలీసులు తనను అరెస్ట్ చేశారని... కేవలం ఓ భార్యగానే తన ఏటీఎం కార్డును మస్తాన్ కు ఇచ్చానని చెప్పింది. ఎర్రచందనంతో తనకు సంబంధం లేనప్పటికీ... పోలీసులు, మీడియా తనను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. మస్తాన్ వలీ తనకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేదని... అతడి వల్ల తనకు ఇబ్బందులు తలెత్తుతాయని కనీసం ఊహించలేకపోయానని కూడా నీతూ చెప్పింది. మస్తాన్ బయటకు వచ్చాక... అతనితో తన సంబంధాల గురించి నిర్ణయించుకుంటానని తెలిపింది.

More Telugu News