: బ్లాక్ వెడ్నెస్ డే... రూ. 2 లక్షల కోట్లు ఆవిరి!

స్టాక్ మార్కెట్లో మరో 'బ్లాక్ వెడ్నెస్ డే' నమోదైంది. క్రితం రోజు యూఎస్ మార్కెట్లు, ఈ ఉదయం ఆసియా మార్కెట్ల నష్టాలకు తోడు, కార్పొరేట్లకు మేలు కలిగించే భూసేకరణ వంటి కీలక బిల్లుల ఆమోదంలో పార్లమెంట్ వెనుకంజ వేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. దీంతో బొంబాయి స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 600 పాయింట్లకు పైగా దిగజారింది. ఇది నాలుగు నెలల కనిష్ఠ స్థాయి. దీని ఫలితంగా నిన్నటితో పోలిస్తే సుమారు రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. ఈ ఉదయం 12:15 నిమిషాల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 621.01 పాయింట్ల నష్టంతో 26,819 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 196.50 పాయింట్లు పడిపోయి 8,128 పాయింట్ల వద్ద కొనసాగింది. మిడ్, స్మాల్ క్యాప్ లు రెండున్నర శాతానికి పైగా దిగజారాయి. మొత్తం 2,397 కంపెనీలు నేటి ట్రేడింగులో పాల్గొనగా, కేవలం 415 కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

More Telugu News