: భాంగ్రా స్టెప్పులతో గేల్, కోహ్లీ ఎంజాయ్... నెట్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో!
వెస్టిండీస్ క్రికెటర్, హిట్టింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ ఎప్పుడూ సంచలనమే. అతడు ఎక్కడుంటే అక్కడ స్టెప్పులే స్టెప్పులే. చివరకు మైదానంలో ఉన్నా, అతడు గంగ్నమ్ స్టెప్పులతో క్రీడాభిమానులకు కనువిందు చేయడమే కాక, జట్టు సభ్యుల్లో జోష్ నింపుతాడు. తాజాగా అతడు పంజాబీ స్టెయిల్ భాంగ్రా స్టెప్పులను నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవడమే కాదండి బాబూ, అచ్చం పంజాబీలా అతడు వేసిన భాంగ్రా స్టెప్పులు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఆటగాడు మన్ దీప్ సింగ్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు గేల్ కు స్టెప్పులు నేర్పించడం, గేల్ భాంగ్రా స్టెప్పులతో సండడి చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతాపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ ఆనందంలో గేల్, కోహ్లీలు డ్రెస్సింగ్ రూంలో భాంగ్రా స్టెప్పులతో హోరెత్తించారు.