: రాయుడు మెరిసెన్ ... ముంబై గెలిచెన్!

తెలుగు తేజం అంబటి రాయుడు వీర విహారం చేస్తే, ముంబై గెలిచి తీరుతుంది. ఐపీఎల్-8 సీజన్ లో ఇప్పటికే రెండుసార్లు రాయుడు ఒంటిచేత్తో ముంబైకి విజయం సాధించిపెట్టాడు. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయుడు వీర విహారంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్ లసిత్ మలింగా తొలి బంతికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ తీసి ఢిల్లీకి షాకిచ్చాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్(19), కెప్టెన్ జేపీ డుమిని(28) నిలకడగా ఆడి జట్టు స్కోరులో వేగం పెంచారు. వీరిద్దరూ ఔటైన తర్వాత క్రీజులోకొచ్చిన యువరాజ్ సింగ్(57)చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను చేజార్చుకున్న ఢిల్లీ 152 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఢిల్లీ బౌలర్ జహీర్ ఖాన్ కూడా షాకిచ్చాడు. మలింగా మాదిరే తొలి బంతికే ముంబై ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత పార్థివ్ పటేల్ (13), హార్డిక్ పాండ్యా (5) వెంటవెంటనే వెనుదిరిగారు. రోహిత్ శర్మ(46) మరోమారు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 40 బంతులను ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ తో 49 పరుగులు రాబట్టాడు. కీరన్ పొలార్డ్ (26) కూడా రాణించాడు. వీరిద్దరి వీరవిహారంతో ముంబై ఇంకో మూడు బంతులు మిగిలుండగానే 153 పరుగులు చేసి, ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

More Telugu News