: ఏటీఎంల సొమ్ము నొక్కేసి, జూదాలాడి, రూ. 57 లక్షలు సంపాదించి, కటకటాలపాలైన సుధీర్
అతను ఏటీఎంలలో డబ్బు నింపే సంస్థలో ఉద్యోగి. కట్టల కట్టల నోట్లు చూసేసరికి బుద్ధి మారింది. మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి సులువుగా డబ్బు సంపాదించవచ్చని ప్లాన్ చేశాడు. చాలా రోజులు సజావుగానే పని సాగింది. ఏటీఎంలలో నింపాల్సిన 1.49 కోట్లు నొక్కేశాడు. జల్సాలు చేశాడు. జూదాలు ఆడాడు. అందులోనూ కలసివచ్చి రూ. 57 లక్షలు సంపాదించాడు. పాపం పండి అధికారుల ఇంటర్నల్ ఆడిట్ లో దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాదుకు చెందిన సుధీర్ కుమార్ బీటెక్ ఫెయిల్ అయ్యాడు. రెండేళ్ల క్రితం క్యాష్ సర్వీస్ మేనేజ్ మెంట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఈసీఐఎల్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లోని ఎస్బీహెచ్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 23 ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు నింపే బాధ్యతను సుధీర్, అశోక్ లకు మేనేజ్ మెంట్ అప్పగించింది. గత సంవత్సరం డిసెంబర్ నుంచి వీరు డబ్బులు దొంగిలించడం ప్రారంభించగా, వీరికి మనోజ్ అనే మాజీ ఉద్యోగి తోడయ్యాడు. కస్టమర్ల తాకిడి తక్కువగా ఉండే ఏటీఎం సెంటర్లను ఎంచుకుని, ఏటీఎం సెంటర్ల డబ్బు నింపిన అనంతరం కాసేపటికి మళ్లీ వెళ్లి రెండో పాస్వర్డ్ సాయంతో లక్షలాది రూపాయలు కొట్టేసేవారు.
వారంలో ఒకసారి జరిగే ఆడిటింగ్ సమయంలో డబ్బును తిరిగి పెట్టేవారు. ఆడిటింగ్ తరువాత తిరిగొచ్చి మళ్లీ దొంగలించేవారు. బ్యాంకుల ఇంటర్నల్ ఆడిట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు మాయమైనట్టు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు నిందితులను అరెస్ట్ చేశారు. దొంగిలించిన డబ్బుతో సుధీర్ ప్రతీ రోజు పబ్ లకు వెళ్లేవాడని, ఫైవ్ స్టార్ హోటల్లో విందులు, గుర్రపు పందేలు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడటం వంటి పనులు చేశాడని, గ్యాంబ్లింగ్ లో రూ. 57 లక్షలు సంపాదించాడని, అతని వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని గ్యాంగ్ మొత్తాన్ని కోర్టు ముందు నిలిపామని వివరించారు.