: పాంటలూన్స్ లో విలీనం కానున్న బిర్లా గ్రూప్ కంపెనీ... ఇండియాలో అతిపెద్ద దుస్తుల రిటైల్ కంపెనీగా అవతరణ!
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే, ఇండియాలో అతిపెద్ద అపెరల్ రిటైల్ కంపెనీగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ఏబీఎఫ్ఆర్ఎల్) నిలవనుంది. కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ నిర్వహిస్తున్న మధురా ఫ్యాషన్, మధురా లైఫ్ స్టయిల్ బ్రాండ్లు బిర్లా గ్రూప్ మరో అనుబంధ లిస్టెడ్ సంస్థ పాంటలూన్స్ ఫ్యాషన్ అండ్ రిటైల్ లో విలీనం కానున్నాయి. ఈ విషయాన్ని కుమార మంగళం బిర్లా స్వయంగా వెల్లడించారు. ఈ విలీనం జరిగితే ఏర్పడే కొత్త సంస్థ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ రూ. 12 వేల కోట్ల విలువతో దేశంలో అతిపెద్ద అపెరల్ రిటైల్ సంస్థగా నిలుస్తుందని తెలిపారు. విలీనం తరువాత ప్రతి 5 ఈక్విటీలను కలిగివున్న ఆదిత్యా బిర్లా నువో వాటాదారులకు 26 పాంటలూన్స్ వాటాలు, ప్రతి 500 వాటాలు కలిగివున్న మధురా గార్మెంట్స్ వాటాదారులకు 7 పాంటలూన్స్ వాటాలు లభిస్తాయని, ప్రిఫరెన్స్ వాటాదారులకు ఒక్కో పాంటలూన్స్ వాటాను ఇస్తామని ఆయన అన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ తరువాత దేశవ్యాప్తంగా ఏబీఎఫ్ఆర్ఎల్ కు 1900 స్టోర్లు ఉంటాయని తెలిపారు. పాంటలూన్స్ ఈక్విటీ బేస్ 9.28 కోట్ల నుంచి 77.28 కోట్లకు పెరగనుందని అన్నారు. తమ వాటాదారులకు మరింత విలువ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, విలీనం లావాదేవీకి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు సలహాదారుగా, ప్రైస్ వాటర్ హౌస్ అండ్ కో ఎల్ఎల్ పీ వాల్యువర్స్ గా సేవలందించనున్నారని వివరించారు.