: కేజీ టు పీజీ అమలు చేయాలంటే రూ. 44 వేల కోట్లు అవసరం... మరి, సాధ్యమేనా?
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అట్టహాసంగా ప్రకటించిన కేజీ టు పీజీ విద్యా పథకం పట్టాలెక్కడం దాదాపు అసంభవంగానే కనపడుతోంది. కనీసం దానికి సంబంధించి ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా అధికార యంత్రాంగం జంకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే, ఈ పథకం అమలు చేయాలంటే కావాల్సిన బడ్జెట్ ఆకాశాన్నంటుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో 61 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ విద్యను అందించాలంటే 6 వేల రెసిడెన్సియల్ పాఠశాలలు అవసరమవుతాయి. అన్ని వసతులతో నిర్మించాలంటే ఒక్కోదానికి రూ. 6 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అంటే మొత్తం రూ. 36 వేల కోట్లు అవసరమన్నమాట. అంతేకాకుండా, ప్రస్తుతం లక్ష మంది టీచర్లు ఉంటే... కేజీ టు పీజీ అమలుకు మూడు లక్షల మంది అధ్యాపకులు అవసరమవుతారు. వీరి కోసం ఏడాదికి రూ. 8 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన కేజీ టు పీజీ అమలు చేయాలంటే మొత్తం మీద రూ. 44 వేల కోట్లు అవసరమవుతాయి. మరి, అంత ఖర్చు చేసి... ఈ గొప్ప కార్యక్రమాన్ని పట్టాలెక్కించగల సీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉందా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశ్చన్.