: తరిమేందుకు వెళితే దాడి చేసిన ఏనుగులు... తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్
గ్రామాలపై దాడిచేస్తున్న ఏనుగులను తరిమేందుకు వెళ్లిన పోలీసులపై అవి తిరగబడ్డాయి. కాలుజారి కిందపడిన కానిస్టేబుల్ పి.త్రినాథ్ రావుపై దాడి చేశాయి. మిగతావారు స్పందించేలోపు ఆయన కాలిని తొక్కేశాయి. దీంతో త్రినాథ్ కాలు విరిగింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలురు మండలం ఎరగడవలసలో జరిగింది. ఈ తెల్లవారుఝాము నుంచి ఏనుగులు సంచరిస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీటిని అడవుల్లోకి తరిమేందుకు యత్నించారు. ఘటనలో గాయపడ్డ త్రినాథ్ తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎనుగుల గుంపు మాత్రం గ్రామ పరిసరాల్లోనే సంచరిస్తోంది. దీంతో, ఎరగడవలస ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.