: ఇండియన్ 'ప్లే బాయ్'... వంద మందితో డేటింగ్ చేశాడు
జాతి, కుల, మతాలు, వయసు తారతమ్యాలు చూడకుండా వంద మందితో డేటింగ్ చేశాడో తమిళ యువకుడు. చెన్నైలో ఉండే సుందర్ రామ్ 21 ఏళ్ల యువతి మొదలుకొని 105 ఏళ్ల బామ్మ వరకు డేటింగ్ చేశాడు. అతని ప్రేమికుల లిస్టులో నటి ఆండ్రియా జెర్మియా నుంచి పండు ముసలి అలివేలు కూడా ఉండడం విశేషం. అందగత్తెలు, కురూపులు అని కాకుండా, జేబులో నయాపైసా ఖర్చు కాకుండా వందమందితో డేటింగ్ చేశాడీ 'ప్లే బాయ్'. డబ్బున్న యువతితో ఫైవ్ స్టార్ హోటల్ లో డేటింగ్ చేసిన సుందర్ రామ్, నిరుపేద యువతి డబ్బులతో రోడ్డు మీద కేవలం పుచ్చకాయతో కడుపు నింపుకోవడం విశేషం.
డేటింగ్ చేసిన మహిళతో ఆ రోజు ఎంత ఖర్చు పెట్టించాడో అంతకు మరింత కలిపి అనాధపిల్లలకు అన్నం పెడుతూ వచ్చాడు. ఫ్రెండ్స్ అంతా తనను 'ప్లే బాయ్' అని పిలిచినా తాను అలాంటి వాడిని మాత్రం కాదని సుందర్ రామ్ చెప్పాడు. తనకు శృంగారంతో సంబంధం లేదని, వివిధ రంగాల్లోని మహిళల్లో సాధికారత తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నాడు. ఈ డేటింగ్ వ్యవహారం కారణంగా తనకు అద్భుతమైన అనుభవాలు మిగిలాయని రామ్ వెల్లడించాడు. 13 ఏళ్లుగా ఇల్లు కదలని ఓ బామ్మను డేటింగ్ పేరిట ఆమె సొంత ఊరికి తీసుకువెళ్లానని, ఈ క్రమంలో ఆమె అనుభవాలు ఎన్నో తెలుసుకున్నానని రామ్ చెప్పాడు.
ఇలా డేటింగ్ చేసిన వంద మందిలో వంద మందిని ఆ రోజుకు నిజంగా ప్రేమించానని రామ్ తెలిపాడు. కొంత మంది అందం చూసి ప్రేమిస్తే, మరి కొందరి అందమైన మనసు చూసి ప్రేమించానని సుందర్ రామ్ వెల్లడించాడు. కొందరికి తాను ప్రపోజ్ చేస్తే, మరి కొందరు తనకు ప్రపోజ్ చేశారని, వారందరి గురించి ఫేస్ బుక్ పేజ్ లో వెల్లడించినట్టు తెలిపాడు. మగాళ్లంతా ఇలా చేయాలని సూచించిన అతగాడు, అందరు మగాళ్లు మంచి వాళ్లు కాదు కనుక జాగ్రత్తగా ఉండాలని మహిళలను హెచ్చరించాడు.