: ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ పోర్టు మనదే
ప్రపంచలో అత్యుత్తమ ఎయిర్ పోర్టుగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) ఎంపికైంది. 2014వ సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఐజీఐఏ ఎంపికైంది. 2014లో 58 స్వదేశీ, 62 అంతర్జాతీయ గమ్యాలకు 4 కోట్ల మంది ప్రయాణికులను చేర్చినట్టు ఐజీఐఏ తెలిపింది. దీంతో ఐజీఐఏను ఈ అవార్డు వరించినట్టు వారు వెల్లడించారు. ఎయిర్పోర్టు సేవల నాణ్యత అవార్డును ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల జోర్డాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందించింది.
వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు, ఎయిర్పోర్టు భాగస్వాములు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించారని ఢిల్లీ ఎయిర్ పోర్టు సీఈవో ఐ.ప్రభాకరరావు చెప్పారు. సేవ నాణ్యతలో 300 మంది సభ్యుల బృందం 5 పాయింట్ల ప్రామాణికంగా పరిశీలించగా, ఢిల్లీ విమానాశ్రయం 4.90 స్కోరు చేసిందని వారు చెప్పారు. 2011, 2012, 2013 సంవత్సరాల్లో వరుసగా రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ, గతేడాది నెంబర్ వన్ గా నిలవడం విశేషం. ఇక్కడి నుంచి సగటున రోజుకు 885 విమానాలు ప్రయాణించినట్టు, అందులో 6.96 లక్షల టన్నుల కార్గోను రవాణా చేసినట్టు విమానాశ్రయాధికారులు తెలిపారు.