: అందని సాయం... బిడ్డల మృతదేహాలను చేతులతో తవ్వి తీసిన తల్లి
భూకంపం ధాటికి మృత్యుదిబ్బగా మారిన నేపాల్ లో హృదయాన్ని ద్రవింపజేసే కథలెన్నో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తక్షణ సాయం కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆకలి, దప్పికలు తీరే దారిలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు కన్నవారు దూరమై కొందరు అనాథలుగా మిగిలితే, బిడ్డలను కోల్పోయిన వారు, మృతదేహాలు కళ్లముందే కుళ్లిపోతుంటే, కుమిలి పోవడం తప్ప చేసేదేమీలేని స్థితిలో ఉన్నారు. నేపాల్ లోని గూర్ఖా లోయలో ఓ తల్లి, మరణించిన తన బిడ్డలకు అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకుంది. ఒట్టి చేతులతో ఒక్కో ఇటుకా తీస్తూ, మట్టిని తొలగిస్తూ, బిడ్డ మృతదేహాన్ని వెలికితీసింది.
భర్త ఇండియాలో పనిచేస్తుండగా, నేపాల్ లోని ఓ కుగ్రామంలో ముగ్గురు పిల్లలతో సుంతాలియా అనే మహిళ ఓ చిన్న ఇంట్లో నివసిస్తోంది. భూకంపం ధాటికి ఇల్లు కుప్పకూలగా, ముగ్గురు బిడ్డలూ మట్టి పెళ్లల కింద కూరుకుపోయారు. ఆ సమయంలో ఇంటి బయట ఉన్న ఆమె ప్రాణాలు మిగిలాయి. నాలుగేళ్ల చిన్న కొడుకు చేతి వేళ్లు బయటకు కనిపిస్తూ కదులుతుండడంతో, వాడిని మాత్రం వెంటనే కాపాడుకోగలిగింది. మిగిలిన ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీసేందుకు ఆ మహిళ గంటలకొద్దీ కష్టపడింది. నేపాల్ లో ఇటువంటి ఘటనలు ఎన్నో... ఎన్నెన్నో!