: అమర్ సింగ్ యావదాస్తిని క్లింటన్ ఫౌండేషన్ కు ఇచ్చేశారట!
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతుల ఆధ్వర్యంలోని క్లింటన్ ఫౌండేషన్ కు భారత్ నుంచి ఓ భారీ చెక్కు అందింది. 5 మిలియన్ డాలర్ల (రూ.31 కోట్లు) విలువ కలిగిన ఆ చెక్కుపై సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ పేరుంది. గతంలో ఎన్నికల సందర్భంగా వెల్లడించిన ఆమర్ సింగ్ ఆస్తుల విలువ కూడా దాదాపు రూ.30 కోట్లే. దీంతో అమర్ సింగ్ తన ఆస్తినంతటినీ క్లింటన్ ఫౌండేషన్ కు దానమిచ్చారని న్యూయాక్క్ పోస్ట్ నిన్న ఓ కథనాన్ని రాసింది. దీంతో ఈ వార్తపై పెద్ద దుమారమే రేగింది.
చాలా కాలం నుంచి మీడియాకు దూరంగా ఉంటున్న అమర్ సింగ్ ఈ వార్త రేపిన దుమారంతో తన అజ్ఞాతాన్ని వీడారు. తనను సంప్రదించిన కొన్ని పత్రికల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. క్లింటన్ ఫౌండేషన్ కు అందిన ఆ దానం తాను చేయలేదని చెబుతూ అమర్ సింగ్ మీడియా ముందుకు వచ్చారు. తన పేరిట తన స్నేహితులెవరో చేసి ఉండవచ్చని చెప్పిన ఆయన, పనిలో పనిగా వారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ విషయాన్ని నా ప్రత్యర్థులు అవకాశంగా తీసుకోలేదు. లేకపోతే నేను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది’’ అని వ్యాఖ్యానించారు.