: పట్టెడన్నం, గుక్క నీరు కరవయ్యాయి... మిన్నంటుతున్న నేపాలీల ఆకలి కేకలు
భూకంపం పెద్ద సంఖ్యలో నేపాలీలను నిరాశ్రయులను చేసింది. తమ ఇళ్లు శిథిలాల గుట్టలను తలపిస్తుండగా, వాటి వద్దే గడుపుతూ, జ్ఞాపకాలను తలచుకుంటూ రోదిస్తున్న నేపాలీల బాధలు వర్ణనాతీతం. ఇప్పుడు వేలాది బాధితులకు తినడానికి తిండిలేదు, తాగడానికి గుక్క నీరు దొరకదు. ఎవరు తమకు సాయం చేస్తారో తెలియని దుస్థితి! తలదాచుకునేందుకు గుడారాలూ లేవు. వ్యవస్థల పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది.
దీంతో, వారు ఖాట్మండూలో నిరసనకు దిగారు. ఉండేందుకు టెంట్లు, ఆహారం, వైద్య చికిత్స అందించాలని కోరారు. అటు, ప్రభుత్వం కూడా చేయగలిగినంత చేస్తున్నా, శక్తికి మించిన పనవుతోంది. దీంతో, అంతర్జాతీయ సమాజంవైపు ఆశగా చూస్తోంది. శనివారం సంభవించిన ఈ భూకంపం తర్వాతి ప్రకంపనలు ఇంకా వస్తూనే ఉండడం వారిని మరింత భీతావహులను చేస్తోంది. పలు దేశాలు ఇప్పటికే నేపాల్ కు సాయం ప్రకటించాయి. అవన్నీ అందితేనే వారికి ఊరట.