: ‘శేషాచలం’ పిటీషన్ ను విచారించలేం... తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

శేషాచలం ఎన్ కౌంటర్ కేసు విచారణను చేపట్టలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం కొండల్లో ఏపీ పోలీసులు చేసిన ఈ ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు చనిపోయారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత ఎన్ కౌంటర్ జరిపిన పోలీసులపై కేసుకు ఏపీ పోలీసు శాఖ నిరాకరించినా, హైకోర్టు ఆదేశాలతో చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయక తప్పలేదు. ఈ కేసు విచారణ ప్రస్తుతం హైదరాబాదులోని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో కొనసాగుతోంది. అంతేకాక జాతీయ మానవ హక్కుల కమిషన్ లోనూ ఈ కేసు విచారణ కొనసాగుతోంది. హైకోర్టు, ఎన్ హెచ్ఆర్సీల్లో విచారణలో ఉన్న కేసును విచారించడం కుదరదని పిటిషనర్ కు సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. మరింత విస్తృత స్థాయి దర్యాప్తు అవసరమన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం, హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.

More Telugu News