: ఇక్కడికొస్తే కేంద్ర మంత్రులనూ సెల్ టవర్లెక్కిస్తాం: హీరో శివాజీ
టాలీవుడ్ నటుడు, బీజేపీ నేత శివాజీ కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వచ్చే కేంద్ర మంత్రులను సెల్ టవర్లెక్కిస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరుకు చెందిన యువకుడు సంజీవరావు నిన్న బీఎస్ఎన్ఎల్ టవరెక్కిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేదాకా కిందకు దిగేది లేదని అతడు తేల్చిచెప్పేశాడు. ఈ ఘటనపై శివాజీ స్పందిస్తూ, ఇప్పటికే సంజీవరావు విషయంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ తో మాట్లాడానని చెప్పారు.
జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి సంజీవరావును కిందకు దించే ఏర్పాటు చేస్తామని స్పీకర్ చెప్పారని శివాజీ తెలిపారు. అయినా సంజీవరావు డిమాండ్ లో న్యాయముందని ఆయన వ్యాఖ్యానించారు. సంజీవరావుకు ఏదైనా జరిగితే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు ఏపీకి వస్తే వారిని కూడా సెల్ టవర్లెక్కిస్తామని శివాజీ అన్నారు.