: నేపాల్ అధ్యక్షుడికి మోదీ ఫోన్
భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ లో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. భారీ ఆస్తినష్టం జరిగింది. శిథిలాల కింద భారీ సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్టు భావిస్తున్నారు. రాజధాని ఖాట్మండూపై తీవ్ర ప్రభావం చూపింది. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ కు ఫోన్ చేశారు. భూకంప ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయం అందిస్తామని చెప్పారు. అటు, భూ ప్రకంపనలతో ఉత్తర భారత రాష్ట్రాలు ఉలిక్కిపడడం తెలిసిందే. దీంతో, బీహార్ సీఎం నితీశ్, సిక్కిం సీఎం పీకే చామ్లింగ్ లకు కూడా మోదీ ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు.