: మోదీని కలసిన పాకిస్థాన్ గజల్ లెజెండ్
పాకిస్థాన్ గజల్ లెజెండ్ గులామ్ అలీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నవ్వుతూ పలకరించుకున్న ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. అనంతరం "గులామ్ అలీ సాబ్ ను కలవటం చాలా సంతోషంగా భావిస్తున్నా" అని మోదీ స్పందించారు. అటు పాక్ గాయకుడు అలీ మాట్లాడుతూ, మోదీని కలవడం చాలా బావుందన్నారు. ఆయన వారణాసి రాలేనందున తనను కలవాలని మోదీ చెప్పారని అలీ తెలిపారు. చాలా సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నామని, తానంటే ఆయనకు చాలా ఇష్టమని ప్రధాని చెప్పినట్టు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ, వారణాసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గులామ్ అలీ తన ప్రదర్శనలు ఇచ్చారు. మోదీ కార్యాలయానికి వచ్చిన పాకిస్థాన్ తొలి రాజకీయేతర వ్యక్తి అలీయే కావడం విశేషం.