: పార్టీ పదవులకూ లక్షలు వెచ్చించారు... టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలపై టీ మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రత్యక్ష ఎన్నికలే కాదండోయ్, పార్టీ సంస్థాగత ఎన్నికల్లోనూ డబ్బుల మూటలు చేతులు మారుతున్నాయట. పార్టీ పదవుల కోసమూ లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రతిపక్ష స్థానాల్లోని పార్టీలో ఈ తరహా వ్యవహారం అంతగా కనిపించకున్నా, అధికార పార్టీల్లో మాత్రం కళ్లు చెదిరే రీతిలో జరుగుతోందట. ఈ విషయాలు చెప్పింది ఏ ప్రతిపక్ష నేతో అనుకుంటే పొరబడినట్లే. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ కమిటీల నుంచి జిల్లా స్థాయి కమిటీ వరకూ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక రాష్ట్ర స్థాయి కార్యవర్గ ఎన్నికలొక్కటే మిగిలాయి. ఈ సందర్భంగా నిన్న పార్టీ సంస్థాగత ఎన్నికలపై టీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవుల కోసం చోటా మోటా నేతలు కూడా లక్షలు ఖర్చుపెట్టారని ఆయన చెప్పారు. గ్రామస్థాయి కమిటీ అధ్యక్ష పదవి కోసమూ లక్షలు ఖర్చు పెట్టిన నేతలూ ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.