: ఆ అమ్మాయిలను మాయమాటలతో లోబరచుకున్న మృగాళ్లు!
ఇంట్లోంచి పారిపోయి, బస్సులో వస్తున్న ఇద్దరు అమ్మాయిలను మాయమాటలతో లోబరచుకొని భోపాల్ సహా వివిధ పట్టణాలు తిప్పుతూ, 20 మంది కామాంధులు 15 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. ఖండ్వా ఎస్పీ ఎం.ఎస్. శికార్వర్ తెలిపిన వివరాల ప్రకారం, రెండు వారాల క్రితం ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి బస్సు ఎక్కారు. అదే బస్సులో ఉన్న నిందితుల్లో ఒకరు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. తొలుత హోషంగాబాద్ తీసుకెళ్ళి ఒక ఇంట్లో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, రేవా పట్టణాల్లో తిప్పారు. పదిహేను రోజులపాటు 20 మంది నరకం చూపారు. ఒక ఇంట్లో ఉంచి బయట తలుపుకు తాళం వేయడం మరచి వారు బయటకు వెళ్లగా, ఇద్దరు అమ్మాయిలూ తప్పించుకుని వచ్చి ఇల్లు చేరి, బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, వారిని ఉంచినట్టు అనుమానిస్తున్న అన్ని ప్రాంతాలకూ పోలీసు బృందాలను పంపినట్టు శికార్వర్ తెలిపారు.