: మన రెండు దేశాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి: మోదీ
భారత్, కెనడా దేశాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కెనడాలోని ఒట్టవాలో కెనడా ప్రధానితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మోదీ మాట్లాడుతూ, కెనడాతో భారత్ కు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. మన రెండు దేశాలు అతి పెద్ద ప్రజాస్వామ్యదేశాలని ఆయన పేర్కొన్నారు. తయారీ రంగంలో మనరెండు దేశాలు ముందంజలో ఉన్నాయని ఆయన వివరించారు. పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
తీవ్రవాదంపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని మోదీ సూచించారు. అణువిద్యుత్ ప్లాంట్లకు యురేనియం సరఫరా చేసేందుకు కెనడా ముందుకు రావడం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు నాంది అని అన్నారు. కాగా, ఐదేళ్ల పాటు భారత్ కు యురేనియం సరఫరాకు కెనడా అంగీకరించిన విషయం తెలిసిందే.