: రోజుకు రూ. 300 కోసం స్మగ్లర్ స్థానంలో జైలుకు వెళ్ళిన కూలీ
నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వెలుగులోకి వస్తుంటే, ఉత్తరప్రదేశ్ లో నకిలీ ఖైదీ ఒకరు జైలులో శిక్షను అనుభవిస్తున్నాడని కనుగొన్నారు. గతనెలలో తన పేరు ఎహసాన్ అని, పోలీసులు వెతుకుతున్న వాంటెడ్ క్రిమినల్ ను అని కోర్టుకు వచ్చి లొంగిపోయాడు. ఆ వెంటనే పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. మూడు వారాల తరువాత అతను రోజువారీ కూలీగా పనిచేసే మియాజాన్ అని, రోజుకు రూ. 300 ఇచ్చే ఒప్పందంపై ఎహసాన్ తరపున జైలుకు వచ్చాడని పోలీసులకు తెలిసింది. ఈ విషయాన్ని మియాజాన్ భార్య స్వయంగా పోలీసులకు తెలిపిందట. కూలీ పనికి వెళ్తే కేవలం రూ. 150 మాత్రమే వస్తుందని అందుకే ఈ పనికి ఒప్పుకున్నానని మియాజాన్ తెలిపాడు. సాధ్యమైనంత త్వరగా బెయిలుపై విడిపిస్తానని ఎహసాన్ హామీ ఇచ్చినట్టు కూడా మియాజాన్ చెప్పాడు. ఆవులు, ఎద్దులు తదితరాలను స్మగ్లింగ్ చేసే ఎహసాన్ చాలాకాలంగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడట.